ఇక్కడ నా గురించి తెలిసిన వాళ్ళు నేను ఓ ప్రేమ కథ అని ఏకవచనం ఉపయోగించేసరికి అవాక్కవుతారు. నిజమే, నాకు ఎన్నో ప్రేమ కథలు ఉన్నాయి, కొన్ని పెద్దవి, కొన్ని చిన్నవి, కొన్ని లెక్క కోసం ఉన్నవి. కాకపోతే ఇవన్నీ ఓ ప్రేమ కథలో పిట్ట కథలు. ఆ పెద్ద ప్రేమ కథని చిన్న గా చెప్పాలంటే…… మనకు ప్రపంచం లో అందమైన రూపం అద్దం లో కనిపిస్తుంది. దానికి మించింది ఏది లేదు అనిపిస్తుంది, ఎంత సేపయినా అలాగే మన ప్రతిరూపాన్ని చూస్తూ ఉండిపోవాలి అనిపిస్తుంది. కడుపు నిండిన వాడికి గారెలు చేదు అనే సామెత ని ఎప్పుడు ఒకే అర్ధం లో వాడతారు. కొంచెం తిప్పి చూస్తే, మన కడుపు సంగతి మనం చూస్కుంటే పక్కోడు ఇచ్చే గారెల మీద ఆధారపడక్కర్లేదు అని కూడా అనిపిస్తుంది. అలాగే మనల్ని మనం ప్రేమించుకుంటే ఇంకొకరి ప్రేమ లేకపోయినా పోయేదేమీ ఉండదు. అయినా లోకం లో ఇంత మందుండగా ప్రేమ ఉంటే ఏంటి లేకపోతే ఏంటి? అదిచ్చే కిక్కు మందిస్తుంది.
ఎక్కడో చదివా, ప్రేమించటం కంటే ప్రేమించబడటం అదృష్టం అని. ఆ అదృష్టం మనకి మనమే ఇచ్చుకుంటే సరిపోతుంది గా. ప్రేమ ఎన్నో పిచ్చి (ఊహించని అని చదవండి) పనులు చేయిస్తుంది. తన కోసం గంటల తరబడి వెయిట్ చేయిస్తుంది. తన తో ఫోన్ లో మాట్లాడేటప్పుడు గుండె వేగం రెట్టింపు చేస్తుంది. తనతో నా చాట్ మళ్ళీ మళ్ళీ చదువుకునేలా చేస్తుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు తన స్వరాన్ని నా చెవులకు అందిస్తుంది. తన ఫొటోలన్నీ వన్నె పేరు తో ట్యాగ్ చేసుకోమంటుంది. తన కోసం అర్ధరాత్రి ప్రయాణం కుదుర్చుకోమంటుంది. తన కోసం తెలియని వాళ్ళ పెళ్ళికి వెళ్ళమంటుంది. తను ఆఫీసు నుంచి వచ్చేవరకు ఎదురు చూడమంటుంది. ఇంటికి తను పోతే తన assignments నన్ను రాయమంటుంది. బస్సు లో కనపడిన ఓ అమ్మాయిని ఫాలో చేయమంటుంది. మెయిన్ రోడ్ మీద షర్టు మార్చుకోమంటుంది. వణుకుతున్న గొంతుని అదుపు లో పెట్టుకుని నాకీ ఉద్యోగం వద్దు అని మేనేజర్ కి చెప్పమంతుంది. ఎవరన్నా ఏమి పట్టనట్టు ఉండమంటుంది. నాన్నకి కాళ్ళు పట్టమంటుంది. అమ్మకి చపాతీలు చేయమంటుంది. తాతకి తల పామమంటుంది. అవును, ఇదంతా ప్రేమే చేస్తుంది. నా మీద నాకున్న ప్రేమ. (గమనిక: పైన నేను చాలా “తను” ల గురించి చెప్పా.)
ఈ ప్రేమ కాకుండా పక్క వారిని కూడా ప్రేమించాలి. లేదంటే నరాలు మూలిగేయ్యవూ! చుట్టూ పక్కల వాళ్ళందరు “మామా, నా లవర్ తో సినిమాకి వెళ్ళా” “ఒసేయ్, నా బాయ్ ఫ్రెండ్ తో లాంగ్ డ్రైవ్ కి వెళ్ళా” అని చెప్తూ ఉంటారు. పెళ్లి కుదిరినా, ప్రేమ ఫలించినా ఫ్రీ పబ్లిసిటీ చేస్కోటానికి పేస్ బుక్ ఎలాగో ఉంది. “కంగ్రాట్స్ రా” “హ్యాపీ మారీడ్ లైఫ్” ఇలాంటి కామెంట్స్ వెల్లువ లా వచ్చి పడతాయి. యింక సినిమాలకి వెళ్తే ఢిల్లీ బెల్లీ, మర్డర్ 2 వంటి సినిమాలకి కూడా జంటలు జంటలు గా వస్తారు. వాళ్ళని చూసి మనకి కూడా ఏదో దారి కనపడితే బాగుండు అనిపిస్తుంది. ఆ దారి కోసం అవసరమయితే ఆరంజ్ లో రామ్ చరణ్ లా మిస్టర్ పెర్ఫెక్ట్ లో ప్రభాస్ లా క్యారెక్టర్ మార్చుకోవాలి అనిపిస్తుంది. అప్పుడు ఈ పెద్ద ప్రేమ కథ ఎండ్ అయ్యి, దాని ప్లేస్ లో ఓ పిట్ట (ద్వంద్వార్ధం లేదు) కథ వస్తుంది. వస్తుందా?
December 18, 2011 at 12:04 pm |
mee love story chala bagundi